మిరపలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఇటిక్యాల: మిరప సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్ బాషా అన్నారు. శనివారం మండలంలోని మునగాలో రైతు నరసింహారెడ్డి సాగు చేసిన మిరప పంటను ఆయన సందర్శించి మిరప పంటపై రక్షణపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. మిరప పంటలో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగి ఆకులు ముడుచుకోవడం, పంట ఎదుగుల తగ్గడం మరియు జెమినీ వైరస్ వ్యాప్తి సమస్యలపై అప్రమత్తంగా ఉండి సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మిరపపంట పొలాల చుట్టూ 2–3 వరుసలుగా జొన్న లేదా మొక్కజొన్న, సజ్జను పంటగా వేసుకోవడం ద్వారా పురుగుల దాడిని తగ్గించవచ్చని, పొలం గట్ల మీద వైరస్ సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే పీకి నాశనం చేయాలని పేర్కొన్నారు. తామర పురుగులు నీలి రంగుకు, తెల్లదోమలు పసుపు రంగుకు ఎక్కువగా ఆకర్షితమవుతాయని, అందువల్ల రైతులు ఒక పొలానికి తగిన సంఖ్యలో నీలి, మరియు జిగురు రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంటలో పురుగుల నియంత్రణకు వేపనూనెను సూచించిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలన్నారు.
పురుగుల నివారణ ఇలా..
పంటలో పురుగుల నివారణకు ఫిఫ్రోనీల్ 80 శాతం విజి 0.20 గ్రా. లేదా అసిటామిప్రిడ్ 20 శాతం, ఎస్‌పి 0.20 గ్రాములు లేదా, ఇమిడాక్లోఫ్రిడ్ 40 శాతం మరియు ఫిప్రోనీల్ 40 శాతం లేదా స్పినోటోరమ్ 1 మీ.లీ లీటరుకు కలిపి 7– 10 రోజుల వ్యవధిలో మందులను ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలన్నారు. మిరపపంటలో క్రింది ముడత నల్లీ ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఏర్పడుతుందని, నల్లీ ఆశించిన ఆకులు తీరగేశిన పడవ ఆకారంలో కనిపిస్తాయని తెలిపారు. ఈ సమస్య నివారణకు స్పైరోమెసాఫెన్ 1 మీ.లీ లేదా ప్రోపెర్గిట్ 2.50 మి.లీ లేదా ఫెనాజూక్విన్ 2 మి.లీ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలని సూచించారు. ఆకులపై మచ్చలు లేదా కాయకుళ్లు కనిపించిన వెంటనే ప్రొపికోనజోల్ 1 మి.లీ, అజాక్జీస్ట్రోబిన్ 1గ్రా, లేదా థయెఫినేట్ బిత్తెల్ 1 మి,లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పంటలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇమ్రాన్, రైతులు పాల్గొన్నారు.


