పాలెం డిగ్రీ కళాశాలలో సమూల మార్పులు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (అటానమస్)లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అకాడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు, యూనివర్సిటీ అకాడమిక్ డీన్‌లు, ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు, ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరై అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన, సిలబస్‌ను అభివృద్ధి చేశారు. అంతేకాక పాఠ్యాంశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం, సవరించడం, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష ఫీజుల నిర్ణయం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, మాడరేషన్, డిటెండ్ నియమాలు, వివిధ ప్రోగ్రాంల వివరణ, విద్యా సంబంధిత నిబంధనలు, ఇతర మార్గ దర్శకాలను రూపొందించారు. సమావేశంలో ప్రొఫెసర్లు చెన్నప్ప, జయపాల్‌రెడ్డి, పాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాములు, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, పెబ్బేరు కళాశాల ప్రిన్సిపల్ వెంకటప్రసాద్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు పద్మజ, శ్రీనివాసులు, నాగరాజు, సుష్మ పాల్గొన్నారు.


