మల్దకల్: ఆదిశిలాక్షేత్రం స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారిలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, అమరవాయి చింతలమునిస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, అరవిందరావు, నాగరాజుశర్మ, వాల్మీకి పూజారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీచుపల్లిని సందర్శించిన ఎమ్మెల్యే బండ్ల
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట భార్య బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, తదితరులున్నారు.
‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాల్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, మహబూబ్‌పాషా, రవిప్రసాద్, నాయకులు బాలగౌడ్, ఆశన్న, ఈశ్వర్, కృష్ణయ్య, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చెరుకు రైతులకు
ప్రోత్సాహకాలు ఇవ్వాలి
అమరచింత: చెరుకు సాగుచేస్తున్న రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన ప్రోత్సాహకాలు అందించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం ఫ్యాక్టరీ డీజీఎం మురళిని కలిసి చెరుకు రైతుల సమస్యలు విన్నవించారు. రెండేళ్లుగా సకాలంలో కోతలు పూర్తి చేయడం, రైతులకు అనుకున్న సమయానికి విత్తనాలు అందించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగు రైతులకు కంపెనీ ప్రకటించిన రాయితీలు అందించి ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్‌లో కోత కార్మికులకు అడ్వాన్సులు ముందస్తుగా చెల్లించి త్వరగా రప్పించాలని, కోత యంత్రాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని డీజీఎంకు అందజేశారు. కార్యక్రమంలో వాసారెడ్డి, నారాయణ, తిరుపతయ్య, నాగేందర్, రామకృష్ణ, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదిశిలాక్షేత్రంలో భక్తుల కిటకిట
ఆదిశిలాక్షేత్రంలో భక్తుల కిటకిట