
మహబూబ్‌నగర్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్‌రావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలతో చర్చలు జరిగినట్టు ప్రచారం సాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ‘ఆత్మీయ సమావేశం’ నిర్వహించనున్నారు.
ఈ సమావేశం అనంతరం అభిలాష్‌రావు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభిలాష్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తిలో బీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్న మంత్రి నిరంజన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ రెండేళ్ల కిందటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అయితే కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరడం, వారి వర్గానికే ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అభిలాష్‌రావు తిరిగి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం బీఆర్‌ఎస్‌లో చేరితే ఏదైనా కీలకమైన పదవి దక్కుతుందని బీఆర్‌ఎస్ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది.
ఈ మేరకు ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలతో అభిలాష్‌రావు కలసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అభిలాష్‌రావు అండగా నిలుస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్టుగా ప్రచారం సాగుతుండటం ఆసక్తికరంగా మారింది.