జాతరకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

జాతరకు వేళాయె..

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

రేపటినుంచి బుగులోని వెంకన్న బ్రహ్మోత్సవాలు

రేగొండ: బుగులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జాతర ఉత్సవాలు ఈ నెల 23న ప్రారంభం కానుండగా.. 27వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండోమెంట్‌ అధికారులు, జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేగొండ మండలం తిరుమలగిరి శివారు గుట్టల్లో వెలసిన బుగులోని వేంకటేశ్వర స్వామిని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తున్నారు. కార్తీక పౌర్ణమికి అభయ స్వరూపుడిగా స్వామి వారు దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఏటా ఐదు రోజుల పాటు జరిగే జాతరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం నీడ కోసం మెట్ల మార్గాన చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు.

ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణ..

బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరకు వచ్చే భక్తులు కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లతో వస్తుంటారు. జాతరకు వచ్చే ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఐదు రోజుల పాటు సాగే జాతరలో ప్రధానంగా స్వామి వారి కల్యాణం విశేషంగా ఆకట్టుకుంటుంది.

జాతర వివరాలు..

23న (సోమవారం) స్వామి వారి ఊరేగింపు, కొండ దగ్గరికి స్వామి వారిని మేళతాళాలతో తీసుకెళ్లుట, సాయంత్రం స్వామి వారి కల్యాణం, తదుపరి స్వామి వారిని గుట్టపైకి వేంచేయుట

24న (మంగళవారం) స్వామి వారికి నిత్య పూజలు– దైవ దర్శనం, ఏనుగు, గుర్రం వాహనాలు తిరుగుట, స్వామి వారికి మొక్కులు చెల్లించుట

25న (బుధవారం) స్వామి వారికి అభిషేకం, తదుపరి దైవ దర్శనం, వాహనాలు తిరుగుట

26న (గురువారం) స్వామి వారికి నిత్య పూజలు, మొక్కులు చెల్లించుట

27న (శుక్రవారం) స్వామి వారికి నిత్య పూజలు, మొక్కులు చెల్లించుట, సాయంత్రం స్వామి వారిని గుట్టపై నుంచి కిందకు దింపుట

రెండో తిరుపతిగా ప్రసిద్ధి

ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణ

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

వేలాదిగా తరలిరానున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement