ప్రకృతి ఒడి.. ఆధ్యాత్మిక జడి! | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడి.. ఆధ్యాత్మిక జడి!

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

కాజీపేట అర్బన్‌/హసన్‌పర్తి/ఖిలావరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో కార్తీక ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. వనభోజనాల సందడి మొదలైంది. ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి విందు చేసుకోవడం.. ఆటపాటలతో ఆనందంగా గడపడం.. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఒకేచోట చేరడం ఈ మాసం ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్న కార్తీక మాస వనభోజనాలపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

కులసంఘాల వారీగా ఏర్పాట్లు

గతంలో కుటుంబాలు, బంధువుల మధ్య పరిమితంగా జరిగే వనభోజనాలు ప్రస్తుతం కుల సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వివిధ కుల సంఘాలు, సామాజిక వర్గాలు ప్రత్యేకంగా సమావేశమై వన సమారాధనలు నిర్వహిస్తున్నాయి. సంఘాల నాయకులు, సభ్యులు ముందస్తుగా సమావేశమై వేదికలు ఎంపిక చేసుకోవడం, భోజన ఏర్పాట్లు చేయడం, కార్యక్రమాల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.

ఉసిరి చెట్టు నీడన పూజలు

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఉసిరి వృక్షాన్ని లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావిస్తారు. ఈనేపథ్యంలో చెట్టును శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూలమాలలు వేసి, దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. నీరు, పండ్లు, పూలు, అక్షింతలు సమర్పించి కొలుస్తారు. పూజలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సంఘ సభ్యులంతా చెట్టు నీడలో భోజనం చేస్తారు. ఆధ్యాత్మికత, ప్రకృతి ఆరాధన, సామాజిక ఐక్యత కలగలిసిన ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.

మొదలైన కార్తీక వన భోజనాల సందడి

కులసంఘాల ఆధ్వర్యంలో వన సమారాధనలు

సంప్రదాయాల పరిరక్షణ, ఐక్యతకు వేదిక

ఐక్యతకు వేదిక

ఒకే సామాజిక వర్గానికి చెందిన వివిధ ప్రాంతాల ప్రజలు ఒకచోట కలుసుకోవడానికి వనభోజనాలు వేదికగా మారుతున్నాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం ఈ కార్యక్రమాల ద్వారా పాత పరిచయాలను గుర్తు చేసుకుంటున్నారు. కొత్త పరిచయాలు ఏర్పర్చుకుంటున్నారు. సంఘంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేద కుటుంబాలకు చేయూత, విద్యార్థులకు ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించుకుంటున్నారు. కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవాలనే భావనకు ఈ సమావేశాలు బలాన్నిస్తున్నాయి. వన భోజనాలకు సామాజిక బాధ్యతను కూడా జోడించాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలు చేపడితే వన సమారాధనకు మరింత అర్థం చేకూరుతుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement