సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

● కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి అర్బన్‌: గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. వైద్యపరంగా అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్‌ ప్రసవాలు నిర్వహించాలని, అనవసర సిజేరియన్లను నియంత్రించాలని స్పష్టం చేశారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ సాధారణ ప్రసవాలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భిణులు, చిన్నపిల్లలు, కౌమార బాలబాలికలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన తాజా గణాంకాలు, నెలవారీ పురోగతి, పనితీరు నివేదికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, వాస్తవ గణాంకాలతో నిర్ణీత సమయంలో సమర్పించాలని స్పష్టం చేశారు. అంతకుముందు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌ జిల్లాలో పలు కార్యక్రమాల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరత్నం, జిల్లా ప్రోగ్రాం అధికారులు, గైనకాలజిస్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement