భూపాలపల్లి: జిల్లాలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను సమగ్రంగా, పకడ్బందీగా పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జనగణన ఫేజ్–2 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో హౌస్ లిస్టింగ్, ఫేజ్–1 ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ఫేజ్–2 జనగణనను పూర్తి చేయాలన్నారు. జనగణన ద్వారా సేకరించిన వివరాలు భవిష్యత్ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు కీలకమని పేర్కొన్నారు. ఈ సారి డిజిటల్ విధానంలో మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్వీయ గణన, కులాలవారీ వివరాల సేకరణపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు జనగణన మాన్యువల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ప్రతీ ఇంటి వివరాలను నిబంధనల ప్రకారం ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సందేహాలను అధికారుల సహకారంతో నివృత్తి చేసుకోవాలన్నారు. జనగణన చట్టం ప్రకారం సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, అనధికార వ్యక్తులతో పంచుకోకూడదని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనగణనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు, సీపీఓ కిష్టయ్య, ఆర్డీఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు, వివిధ శాఖల అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


