● సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్
యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్
ఎస్‌ఎస్ తాడ్వాయి: వైద్యులకు కరుణ, సేవాభావం అంతర్భాగంగా ఉండాలని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ వై.ఎల్. శ్రీనివాస్ అన్నారు. గిరిజన గ్రామాల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించి, మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సేవాంకుర్ భారత్, వనవాసి కల్యాణ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశం కోసం – మూడు రోజులు కార్యక్రమం శుక్రవారం మండలకేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది ఆదివాసీ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు తెలంగాణలోని 16 వైద్య కళాశాలలకు చెందిన సుమారు 120 మంది వైద్య విద్యార్థులు, వైద్యుల బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ డాక్టర్ వై.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకుని నాణ్యమైన వైద్య సేవలు అందించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వనవాసి కల్యాణ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి తాడేపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ గిరిజన సమాజంలోని బలహీన వర్గాలను బలోపేతం చేయడమే సేవా కార్యక్రమాల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ చిలకమర్రి సంజీవ్, ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ హౌస్ సర్జనన్ ఉమ, విద్యార్థులు, వైద్య బృందం పాల్గొన్నారు.


