కాళేశ్వరం: ‘వామ్మో.. అన్నారం బ్యారేజీలో మొసలి’ సంచారం శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్, అటవీశాఖ అధికారులు స్పందించారు. మహదేవపూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ నీటిలో మొసలి సంచరిస్తుందని సామాజిక మాద్యమాల్లో ఇరిగేషన్ అధికారులు ప్రచారం చేశారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలు స్నానాలకు నీటిలో దిగొద్దని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే మహదేవపూర్ అటవీశాఖ అధికారులు బ్యారేజీ తీరంలో సిబ్బందితో కలిసి పరిశీలించారు. మంచిర్యాలవైపు నీటి మడుగు ఉండడంతో మొసలి గేట్ల వద్ద మొసలి ఆనవాళ్లు కనిపించలేదని తెలిసింది. మళ్లీ శుక్రవారం మొసలి ఆనవాళ్ల కోసం ఆన్వేషిస్తామని అటవీశాఖ రేంజర్ రవికుమార్ తెలిపారు.
వైద్యురాలికి మెమో
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం పీహెచ్‌సీ వైద్యాధికారి సుస్మితకు డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌రావు మెమో జారీ చేసినట్లు తెలిసింది. బుధవారం డ్రెసింగ్ కోసం వచ్చిన బాలింతకు వైద్యం అందలేదని గురువారం సాక్షిలో వచ్చిన కథనానికి వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆయన స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను డాక్టర్ సుస్మితకు మెమో జారీ చేశారు.
నేడు కేయూలో పలు అభివృద్ధి
కార్యక్రమాల ప్రారంభోత్సవం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ హాస్టల్‌నుంచి కెనాల్ సమీపంలోని కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల వరకు రూ.1.34 కోట్ల వ్యయంతో కిలోమీటర్ మేర చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా పరీక్షల విభాగం పక్కనే రూ1.67 కోట్ల వ్యయంతో పరీక్షల విభాగం రెండో బ్లాక్ భవనం నిర్మించారు. ఈ రెండు అభివృద్ధి పనులను నేడు (శుక్రవారం) కేయూ వీసీ కె ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. అభివృద్ధి అధికారి ఆచార్య వై.వెంకయ్యలతో కలిసి ప్రారంభించనున్నారు.
పనుల్లో నాణ్యతా
ప్రమాణాలు పాటించాలి
ములుగు: మోడల్ బస్టాండ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క గురువారం జిల్లా కేంద్రంలోని మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, నిర్మాణ పనులతో పాటు ఇతర పనుల పురోగతిని పరిశీలించి పనుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనులను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, విద్యుద్ధీపాలతో పాటు మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భైరెడ్డి భగవాన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
లంబాడీ తండాలో
తీజ్ వేడుకలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ పరిధిలో గల లంబాడీ తండాలో గురువారం గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అజ్మీర హరీశ్ మాట్లాడుతూ గోదుమలను తొమ్మిదిరోజులు బుట్టలో నానబెట్టి, బుట్ట వద్ద ప్రతిరోజూ సాయంత్రం పూజలు నిర్వహించి సంతోషంగా నృత్యాలు చేస్తారని తెలిపారు. తొమ్మిదో రోజు పూర్తయ్యే నాటికి మొలకల్లో కొన్నింటిని గిరిజన పెద్దల తలపాగల్లో వేసి మిగిలిన వాటిని సమీపంలోని చెరువులో వదిలేస్తారని తెలిపారు. అనంతరం బుట్టలను తెచ్చిన యువతుల కాళ్లను వాళ్ల సోదరులు కడిగి ఆశీస్సులు తీసుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బానోత్ స్వామిలాల్, హట్కర్ దేవేందర్, బానోతు సమ్మయ్య, పొరిక పర్తి, ధరావత్ తిరుపతి, అజ్మీరా సీతారాం, సురేశ్, బాల్య నాయక్, బానోతు రుషిత, సుమశ్రీ, కీర్తన, భూక్య నిఖిత, అమూల్య, అర్చన పాల్గొన్నారు.


