జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రజలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో, జమ్మిచెట్టు వద్ద పూజలు, రావణ వధ కార్యక్రమాలు చేపట్టారు. దుర్గమాత ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వాహన యజమానులు వాహన పూజలు చేపట్టి ఏడాదంతా ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వారికి స్వాగతం పలికారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
జబర్దస్త్ కళాకారులు రాకింగ్ రాకేష్, సద్దాం, జోర్దార్ సుజాత, ఫోక్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. హాస్య స్కిట్లు, జానపద పాటలు, నృత్యాలతో స్టేడియం సందడిగా మారింది. కళాకారుల ప్రదర్శనలకు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్పందించారు.
రావణ వధతో ముగింపు
వేడుకల అనంతరం 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన రావణసురవధకు ఎమ్మెల్యే నిప్పు అంటించారు. ఈ వేడుకను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒకరికొకరు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఘర్షనలు చోటు చేసుకొకుండా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో జబర్దస్త్ కళాకారుల ప్రదర్శన
వేడుకులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ, కలెక్టర్, ఎస్పీ


