భూపాలపల్లి అర్బన్: తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా కదిలొచ్చిన మహిళాలోకం ఆడిపాడి పులకించింది. సంప్రదాయ బద్ధంగా పాటలు పాడి సద్దుల సంబురం జరుపుకున్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, టేకు తదితర వర్ణాల పుష్పాలు నేలపై ‘పాల’ పుంత మాదిరి పరుచుకుని ఉండగా.. యువతులు, బాలికలు ఉత్సాహంగా కోలాటమాడి కొత్త శోభను అద్దారు. భూపాలపల్లి పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ మైదానాల్లో జన కోలాహలం నెలకొంది. జిల్లాలోని కాటారం, చెల్పూర్, చిట్యాల, గణపురం కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో ఆనందంగా జరుపుకుని పోయిరా బతుకమ్మా.. వచ్చే సంవత్సరం మళ్లీ రావమ్మా అంటూ గంగమ్మ సన్నిధికి సాగనంపి వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. పట్టణంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు.
పట్టణంలో ఘనంగా..
భూపాలపల్లి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాత కూరగాయల అంగడి మైదానాలు, హనుమాన్ దేవాలయం, సంతోషిమాత, రామాలయం, అయ్యప్ప ఆలయాల వద్ద బతుకమ్మ వేడుకులకు మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రాంగణాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడిన అనంతరం పట్టణ శివారులో పాత ఎర్ర చెరువులో నిమజ్జనం చేశారు.


