కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయం వద్ద ప్రతీ ఏడాది విజయదశమి సందర్భంగా భక్తులు తమ వాహనాలకు పూజలు నిర్వహిస్తారు. ఈసారి కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనుల కారణంగా వాహన పూజలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా రామాలయానికి వచ్చే దారికి పడమర వైపున రేకుల నిర్మాణం చేపట్టడంతో రాకపోకలకు దారి లేకుండా పోయింది. ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న రహదారిపైన వాహన పూజ చేయకుండా మట్టి కుప్పలు అడ్డంగా పోశారు. తూర్పున ప్రధాన రహదారి నుంచి ఆలయంలోకి వెళ్లే మార్గంలో మెట్లు అడ్డుగా ఉండడంతో వాహనాలు పైకి ఎక్కి ఆలయం వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలుపుదల చేస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో విజయదశమి రోజున వాహన పూజలు నిర్వహించేందుకు భక్తులు ఎలా చేరుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రతీ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు వాహన పూజల కోసం వచ్చే నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. పండుగ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
కాళేశ్వరంలో రామాలయం వద్ద
అడ్డంగా రేకులు నిర్మాణం, మట్టి కుప్పలు
భక్తులకు తప్పని ఇబ్బందులు


