ఎల్‌నినోపై అవగాహన కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోపై అవగాహన కార్యక్రమాలు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలో ఎల్‌నినోతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఢిల్లీ నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎల్‌నినోపై పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కొంపల్లి రైతు వేదిక నుంచి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఉద్యాన పంటలు, నూనెగింజలు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా వ్యవసాయ పెట్టుబడులపై నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రత్యామ్నాయ పంటల వివరాలను వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నిరంతరం అందించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ, అధికారి బాబూరావు, ఉద్యానవన శాఖ అధికారి తిరుపతి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సదానందం, సీపీఓ కృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

భూపాలపల్లి: తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరిష్కారంలో జాప్యంచేస్తే చర్యలు

భూపాలపల్లి అర్బన్‌: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై ఆశతో ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నందున అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.

పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

పట్టణంలోని మహేశ్వర ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిట్స్‌ పాఠశాల గుర్తింపును రద్దు చేసి చైర్మన్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త కుసుమ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

శాత్రాజ్‌పల్లి బాధితుల ఆందోళన..

మల్హర్‌ మండలం శాత్రాజ్‌పల్లి గ్రామంలో అనుమతిలేని నివాస గృహాలను మూడు రోజుల క్రితం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో బాధితులు సుమారు వంద మంది వరకు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజావాణిలో ఫిర్యాదు అందించేందుకు వెళ్తున్న బాధితులను పోలీసులు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో కొంత మంది బాధితులను లోపలికి అనుమతించారు. కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement