భూపాలపల్లి అర్బన్: కార్యాలయాల కూల్చివేత ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేసినట్లేనని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు తెలిపారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయ ప్రహరీ కూల్చివేతను ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణరావు ఖండించారు. సోమవారంలో ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యాలయ కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపి చట్టబద్ధమైన అనుమతులు, విధివిధానాలు పాటించారా లేదా తేల్చాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు కార్మిక సంఘాల హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యలు బాధ్యత వహించాలని కోరారు. కార్మిక సంఘాల స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను ప్రజాస్వామ్య శక్తులు అడ్డుకుంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాని, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, టీఎస్‌యూఎస్ నాయకులు మిట్టపల్లి కుమారస్వామి, నీరేటి రాజన్న, పీక కిరణ్, ఐత బాబు, పార్వతక్క, దాసరి జనార్ధన్, జైపాల్ సింగ్, గోడిశెల శ్రీహరి, నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు.


