అతిక్రమిస్తే అంతే..! | - | Sakshi
Sakshi News home page

అతిక్రమిస్తే అంతే..!

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

ఇందిరమ్మ నిర్మాణాలకు కొత్త నిబంధనలు

● స్లాబ్‌ 750 చదరపు అడుగులు దాటితే బిల్లుల నిలిపివేత

● అమల్లోకి కొత్త నిబంధనలు

భూపాలపల్లి అర్బన్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో గృహ నిర్మాణ శాఖ సరికొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో స్లాబ్‌ వైశాల్యంపై కఠిన పరిమితులు విధించింది. అనుమతించిన ఇంటి స్లాబ్‌ 750చదరపు అడుగులు దాటితే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన లబ్ధిదారులకు నోటీసులు జారీచేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా..

జిల్లా పరిధిలోని 12 మండలాల్లో మొదటలో ఇళ్లకు 4,075 మార్కవుట్‌ చేశారు. పూర్తయిన ఇళ్లు 1,296, బేస్‌మెంట్‌ లెవల్‌ దశలో 814, రూప్‌ లెవల్‌ 381, స్లాబ్‌లో 1,079, ప్రారంభం కాని 534 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇళ్ల నిర్మాణం నత్తనడక సాగుతుండడంతో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు మరింత పెంచింది. డీఈఈ, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. స్లాబ్‌ సైజు ఎక్కువ చేసి అప్పుల పాలుకావద్దని సూచిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో చాలామంది..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3నుంచి 8అడుగుల వరకు స్లాబు ముందుకు పొడిగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి అందే ఐదు లక్షల రూపాయల సాయం సరిపోక పేదలు అప్పుల బారిన పడుతున్నారని, మరికొందరు ఈ భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారని భావిస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించి ప్రభుత్వ సాయంతోనే ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలనే లక్ష్యంతో స్లాబ్‌ వైశాల్యంపై పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో ఇంటి స్లాబ్‌ 750చదరపు అడుగులు దాటి తే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామంటూ గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.

జీవో 352 ప్రకారం..

ప్రభుత్వం విడుదల చేసిన జీవో 352 ప్రకారం.. 400చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్‌ వైశాల్యం గరిష్టంగా 500ఫీట్ల లోపే ఉండాలి. 600 స్క్వేర్‌ ఫిట్‌ ప్లింత్‌ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్‌ గరిష్టంగా 750 స్క్వేర్‌ ఫీట్ల వరకే ఉండాలి. ఇంటి ముందువైపు స్లాబ్‌ పొడగింపును గరిష్ఠంగా మూడు అడుగులకు పరిమితం చేసి మిగిలిన మూడువైపులా ఒక్క అడుగు మాత్రమే పొడిగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అక్టోబరు 1నుంచి అమల్లోకి వచ్చాయని, స్లాబ్‌ నిర్మాణంలో సైజు పెంచితే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామని నోటీసులో హెచ్చరించారు. ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో స్లాబ్‌ వేసినవారు ఏఈ, డీఈఈని సంప్రదించాలని, నిబంధనలు పాటించకుండా ఆర్థికంగా నష్టపోతే లబ్ధిదారులే బాధ్యులని హౌసింగ్‌ శాఖ పేర్కొన్నది. మార్గదర్శకాలకు విరుద్ధంగా అదనపు నిర్మాణం చేపట్టి నష్టపోకుండా జాగ్రత్త వహించాలని జారీచేసిన నోటీసుల్లో ప్రభుత్వం సూచించింది.

నిబంధనల ప్రకారమే నిర్మించుకోవాలి..

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పలు నిబంధనలు జారీచేసిన నేపథ్యంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి. ఇప్పటికే లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తున్నాం. స్లాబ్‌సైజ్‌ ఎక్కువ వేయడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడి అప్పుల పాలవుతున్నారు. అందుకే ప్రభుత్వం స్లాబ్‌ విస్తీర్ణంలో పరిమితి విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన సైజులో ఇళ్లు కట్టుకుంటే దశల వారీగా బిల్లులు వస్తాయి.

– శ్రీకాంత్‌ గృహనిర్మాణ శాఖ, ఇన్‌చార్జ్‌ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement