భూపాలపల్లి రూరల్: సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు నిజానిజాలు ధృవీకరించుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ సమాచారం నిజం కాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడిట్ చేసిన వీడియోలు, నకిలీ స్క్రీన్‌షాట్‌లు, డీప్‌ఫేక్‌లు, తప్పుడు వార్తల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చే సమాచారాన్ని చూసిన వెంటనే నమ్మడం లేదా ఇతరులకు షేర్ చేయవద్దన్నారు. అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ప్రజల్లో అపోహలు, అనవసర భయాందోళనలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించాలని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఎస్టీ కమిషన్ సభ్యుల
పర్యటన వాయిదా
భూపాలపల్లి రూరల్: జిల్లాలో ఈనెల 13న జరగాల్సిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన వాయిదా పడినట్లు, దసరా పండుగ అనంతరం ఈ పర్యటన తేదిలను ఖరారు చేయనున్నట్లు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ డైరెక్టర్ డాక్టర్ కల్యాణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషన్‌లో ఇప్పటికే నమోదైన గిరిజనుల ఫిర్యాదులు, వినతులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
బాల కవి సమ్మేళనం
కాళేశ్వరం: కాళేశ్వరం పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బాల కవి సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. 25 మంది విద్యార్థులు కవితలు వినిపించి ప్రతిభ చాటుకున్నారు. విద్యార్థుల కవితలను సాహితీ ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా పాకాల కవుల బృందానికి చెందిన కవి పుచ్చ కుమారస్వామి విజేతలకు నగదు బహుమతులు, షీల్డులు, పుస్తకాలు అందజేశారు. ప్రథమ బహుమతి మాడుగుల వరణ్య సుమహిత రూ.1,000, ద్వితీయ బహుమతి కటుకు అలేఖ్య రూ.600, తృతీయ బహుమతి ముంగి శ్రీలేఖ రూ.400 గెలుచుకున్నారు. నాలుగో స్థానం గాడిపల్లి భార్గవి, ఐదో స్థానం ఎస్.కె. జోయా సాధించారు. హెచ్‌ఎం దోనికల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాడుగుల భాస్కర్ శర్మ కవులను, విద్యార్థులను సత్కరించారు. మురళీధర శర్మ, నారాయణమూర్తి, శ్రీనివాస శర్మ, శ్రీకాంత్ శర్మ, రామగుండం రామ్మూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
పొదల్లోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్
కాళేశ్వరం: స్టీరింగ్ ఫెయిల్ కావడంతో ఇసుక టిప్పర్ చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మహదేవపూర్ మండలం కూదురుపల్లి–ఎడపల్లి మధ్య జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కడుపులో 9 కేజీల కణితి తొలగింపు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని కిరణ్ ఆస్పత్రిలో ఆదివారం మహిళ కడుపులో నుంచి సుమారు 9 కేజీల కణితిని తొలగించారు. డాక్టర్ కిరణ్ వివరాల ప్రకారం.. మహరాష్ట్ర సిరొంచకు చెందిన సురక్క ఐదేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి రాగా స్కానింగ్ చేసి కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రష్మిత, డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెండున్నర గంటల పాటు శ్రమించి కణితిని తొ లగించారు. రోగి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.


