● అటవీప్రాంతంలో రెండు రోజులుగా గాలిస్తున్న పోలీసులు
● కన్నీరుమున్నీరు అవుతున్న
కుటుంబసభ్యులు
మహాముత్తారం: మండలంలోని నిమ్మగూడెం అటవీప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్‌తీగలు తగిలి అశోక్(31) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా మృతదేహం లభ్యంకాలేదు. రెండు రోజులుగా పోలీసులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి నిమ్మగూడెం, యామన్‌పల్లి అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి అడవిని జల్లెడపడుతున్నప్పటికీ మృతదేహం ఆచూకీ దొరకలేదు. ఆదివారం కూడా డాగ్‌స్కాడ్‌తో కాటారం సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు అడవిని జల్లెడపట్టారు.
యామన్‌పల్లిలో ధర్నా..
రెండు రోజులు గడుస్తున్నా అశోక్ మృతదేహం లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి ఆవేదనకు గురైన మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు యామన్‌పల్లి ప్రధానచౌరస్తా వద్ద బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతదేహాన్ని అప్పగించే వరకు కదిలేదిలేదని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తెల్లవారేసరికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆచూకీ తెలుపుతామని చెప్పారు. గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు, అశోక్ కుటుంబసభ్యులు శాంతించారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


