పదేళ్ల ప్రగతి పరుగు | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల ప్రగతి పరుగు

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

– మరిన్ని ఫొటోలు IIIలోu

జిల్లాకేంద్రంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు

జిల్లాకేంద్రంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

భూపాలపల్లి: నాడు కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి.. కేటీపీపీ, సింగరేణి పరిశ్రమలతో దినదినం అభివృద్ధి చెందుతున్న క్రమంలో దశాబ్ద కాలం క్రితం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడింది. ఫలితంగా పరిపాలన సౌలభ్యంతో పాటు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాకు పేరు వచ్చింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన అనంతరం భూపాలపల్లి పట్టణం సైతం ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది.

11 మండలాలతో ఏర్పాటు..

భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలతో పాటు కొత్తగా టేకుమట్ల మండలం, మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్‌, మహదేవపూర్‌, కొత్తగా పలిమెల మండలాన్ని ఏర్పాటు చేసి.. మొత్తంగా 11 మండలాలతో కూడిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 11న ఏర్పాటు చేసింది. అనంతరం రేగొండ మండలాన్ని విభజించి కొత్తపల్లిగోరి మండలాన్ని ఏర్పాటు చేశారు.

25 ఎకరాల్లో కలెక్టరేట్‌..

జిల్లా ఏర్పడిన అనంతరం 25 ఎకరాల్లో సుమారు రూ.68.25కోట్లతో సమీకృత కలెక్టరేట్‌ నిర్మించారు. రూ.45కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించారు. జిల్లా ఏర్పాటుకు ముందు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌ కేంద్రానికి వెళ్లేవారు. జిల్లా ఏర్పాటుతో బాధలు తప్పాయి. ప్రతీ సమస్యను ఇక్కడే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశం లభించింది.

అందుబాటులో మెరుగైన వైద్యం..

ఈ ప్రాంతంలో ఎక్కడ చిన్న ప్రమాదం జరిగినా, చికిత్స అవసరమైనా అత్యవసర వైద్యసేవల కోసం గతంలో వరంగల్‌ పట్టణానికి పరుగులు పెట్టాల్సి వచ్చేంది. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జిల్లా ఏర్పాటు అనంతరం వైద్యరంగంలో ఊహించని రీతిలో మార్పులు వచ్చాయి. రూ.6కోట్లతో వంద పడకల ఆస్పత్రి నిర్మించారు. అనంతరం మెడికల్‌ కళాశాలను సైతం మంజూరు చేసి, భవన నిర్మాణం చేపట్టడంతో పాటు జిల్లా ఆస్పత్రిని 250 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో జిల్లాతో పాటు సరిహద్దులో గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు.

జిల్లా కేంద్రం అభివృద్ధి..

జిల్లా ఏర్పాటు అనంతరం భూపాలపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందింది. రూ.63 కోట్లతో వేశాలపల్లి, భాస్కర్‌ గడ్డలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం, రూ.4కోట్లతో మున్సిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణం, రూ.6కోట్లతో సుభాష్‌ కాలనీలో మినీ స్టేడియం తదితర పనులను ప్రభుత్వం చేపట్టింది. సింగరేణి కార్మికుల సౌకర్యార్థం వేయి క్వార్టర్లు నిర్మించి రామప్ప కాలనీగా నామకరణం చేశారు.

జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి

పరిపాలనా సౌలభ్యం,

మారిన రూపురేఖలు

జిల్లా ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలతో

మెరుగైన వైద్యం

జిల్లా ప్రజల డిమాండ్లు..

జిల్లాలో పుష్కలంగా గోదావరి జలాలు, సింగరేణి బొగ్గు, కేటీపీపీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

బొగ్గు, ఇసుక లారీలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలో బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

జిల్లా ప్రధాన ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌తో పాటు పలు ప్రధాన విభాగాలకు వైద్య నిపుణులు లేరు. వైద్యులను నియమిస్తే ఈ ప్రాంత ప్రజలకు మరింత అత్యవసర వైద్యసేవలు అందనున్నాయి.

సింగరేణి సహకారంతో పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement