భూపాలపల్లి అర్బన్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళల ఆత్మీయత, ఐక్యత, ఆత్మగౌరవాన్ని చాటే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లలను బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలకు తీసుకెళ్లవద్దని చెప్పారు.
ప్రభుత్వంలో
ఆర్టీసీ విలీనమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9న జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)–ఏఐటీయూసీ కూటమి విజయం సాధించిందని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని కొమురయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సుమారు 90 డిపోలకు గాను 60 డిపోల్లో కూటమి గెలిచిందన్నారు. నాలుగు వేలకుపైగా ఓట్ల ఆధిక్యం సాధించిందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్‌కుమార్, ఈయూ నాయకులు రాజయ్య, ఎల్ల గౌడ్, మంతెన అనిత, తోక రాజయ్య పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో చలో జంతర్‌మంతర్ కార్యక్రమానికి మద్దతుగా శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు విఘాతమని విమర్శించారు. ఢిల్లీలో నిరసనకారుల అరెస్టులను ఖండిస్తూ, వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు నక్క తిరుపతి, టీపీటీఎఫ్ అధ్యక్షుడు సేవానాయక్, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజనులు సమస్యలు విన్నవించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈ నెల 13న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో గిరిజనులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోష్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనుల సమస్యలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా, వైద్య సదుపాయాలు, రహదారులు, తాగునీరు, భూ సమస్యలు, అటవీ హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై వినతులు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక
చిట్యాల: మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి బానోత్ శ్రీధర్ రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర అండర్–14 ట్రయాథ్లాన్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. నేటి (ఆదివారం) నుంచి కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థికి ఏంఈఓ కొడెపాక రఘుపతి అభినందనలు తెలిపారు.


