మల్హర్(కాటారం): పెండింగ్ కేసులను త్వరిగతిన పరిష్కరించి పూర్తి చేయాలని అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని కాటారం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, లాకప్ రూమ్, పరిసరాల పరిశుభ్రతను ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.


