హౌస్‌ సర్జన్లకు సమాన స్టైఫండ్‌ చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

హౌస్‌ సర్జన్లకు సమాన స్టైఫండ్‌ చెల్లించాలి

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

భూపాలపల్లి అర్బన్‌: హౌస్‌సర్జన్‌ వైద్యులకు నెలకు రూ.29,792 స్టైఫండ్‌ చెల్లించాలని ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం భూపాలపల్లి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. 2026 జనవరి నుంచి స్టైఫండ్‌ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ క్యాజువాలిటీ, ఐసీయూ, ఓపీ విభాగాల్లో 24 గంటలపాటు సేవలందిస్తున్నామని తెలిపారు. జాతీయ వైద్య మండలి సూచనల ప్రకారం ఇంటర్న్‌షిప్‌ వైద్యులందరికీ సమాన పారితోషికం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు హౌస్‌సర్జన్లు పాల్గొన్నారు.

51శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలి

భూపాలపల్లి అర్బన్‌: పీఆర్సీ నివేదిక కోసం 36 నెలలుగా ఎదురుచూడాల్సి రావడం విచారకరమని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో లోపాలు సరిదిద్ది, అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం అందక మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ఉద్యోగుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి ఎ.దశరథరామారావు కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

తాడిచర్ల బ్లాక్‌–1లో రికార్డు బొగ్గు ఉత్పత్తి

మల్హర్‌: తాడిచర్ల బ్లాక్‌–1 జెన్‌ కో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ ఏడాది ఆరు నెలల్లో 12.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా, దానిని అధిగమించి 16.35 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గును వెలికితీశారు. ఉత్పత్తి చేసిన బొగ్గును చెల్పూర్‌లోని కేటీపీపీకి తరలిస్తున్నారు. మైన్‌ ప్రారంభించిన ఏడేళ్లలో అర్ధ వార్షిక లక్ష్యాన్ని దాటడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మొత్తం లక్ష్యంలో ఇంకా 13.65 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏఎమ్మార్‌ కంపెనీ, జెన్‌ కో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్యాన్ని సాధించడంలో కృషి చేసిన కార్మికులు, సిబ్బంది, అధికారులను జెన్‌ కో డైరెక్టర్‌ నాగ్యా, జీఎం మోహన్‌ రావు, ఏఎమ్మార్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

నిరంతరాయంగా

విద్యుత్‌ సరఫరా

భూపాలపల్లి రూరల్‌: బతుకమ్మ, దసరా పండుగలకు గ్రామాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఎస్‌ఈ నాగెల్లి సదానందం అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో అధికారుల సమీక్ష సమావేశంలో ఎస్‌ఈ మాట్లాడారు. వినియోగదారుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పనులుచేసే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌, లోడ్లు పెరిగిన నేపథ్యంలో.. లైన్‌ క్లియరెన్స్‌లను వీలైనంత వరకు తగ్గించి, వ్యవసాయ ఫీడర్లకు అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించాలని ఏఈలను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్‌ లైన్ల పనులను పూర్తిచేసి కనెక్షన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భూపాలపల్లి డీఈ పాపిరెడ్డి, కాటారం డీఈ నాగరాజు, భూపాలపల్లి టెక్నికల్‌, ఎంఆర్‌టీ కన్స్‌ట్రక్షన్‌ డీఈ జగదీశ్‌, భూపాలపల్లి సర్కిల్‌ ఆఫీస్‌ ఎస్‌ఏఓ లక్పతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement