● కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి అర్బన్: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ ఈ నెల 13న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించి, లోటుపాట్లు లేకుండా సిద్ధం చేయాలన్నారు. నివేదికలను వీలైనంత త్వరగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి అందించాలని సూచించారు. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా స్థాయి సమగ్ర నివేదిక రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. కమిషన్ సభ్యుడి పర్యటనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా సమాచారాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఏఎస్పీ నరేశ్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
యాసంగి సాగు ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి
యాసంగి సాగు ప్రణాళికలు, పంటల ఎంపిక, నీటి లభ్యతపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యాసంగి సాగు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా, తాగునీటి లభ్యతపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సమాచారంతో సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేలా సమాచార హక్కు చట్టం–2005ను పకడ్బందీగా అమలు చేయాలని గవర్నర్ శివ ప్రతాప్‌శుక్ల సూచించారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వివిధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోన్నారు.


