లక్ష్యాల సాధనకు పక్కా ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాల సాధనకు పక్కా ప్రణాళిక

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సింగరేణి డైరెక్టర్‌ (ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌) కొప్పుల వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మానవ వనరులు, భారీ యంత్రాలు, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించిన ఆయన ముందుగా ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డితో కలిసి కేటీకే ఓసీ–2, 3 ఓపెన్‌కాస్ట్‌ గనులను సందర్శించారు. క్షేత్రస్థాయిలో బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్‌ తొలగింపు, గని అభివృద్ధి పనులు, యంత్రాల పనితీరును పరిశీలించారు. ఉత్పత్తి పురోగతి, లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏరియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఉత్పత్తి పరిస్థితులు, నిర్దేశిత లక్ష్యాలు, ఓవర్‌బర్డెన్‌ తొలగింపు, గని అభివృద్ధి, యంత్రాల వినియోగం, భవిష్యత్‌ ఉత్పత్తి ప్రణాళికలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, భవిష్యత్‌ ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా గనుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఉత్పత్తి పెంపు క్రమంలో భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ ఉండకూడదని డైరెక్టర్‌ స్పష్టం చేశారు. సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం రామన్‌ వి.పాఠక్‌, ఓసీ–2 పీఓ డి.శ్యాంసుందర్‌, ఓసీ–3 పీవో రామస్వామి, ఏజీఎం (సివిల్‌) రవికుమార్‌, ఏజీఎం (ఈఅండ్‌ఎం) సాంబశివరావు, డీజీఎం (ఫైనాన్స్‌) రాజేశ్వర్‌, పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యామ్‌సుందర్‌, ఏరియా సర్వే ఆఫీసర్‌ శైలేంద్రకుమార్‌, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, గనుల మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

కాళేశ్వరం: రూ.198 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనులు రెండు నెలలుగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ ప్రాంతం చుట్టూ కంచె ఏర్పాటు చేసి ప్రజలు, మీడియా ప్రతినిధులను సైతం లోపలికి అనుమతించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆలయ ప్రాంతం నిషేధిత ప్రాంతంగా మారిందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. పునర్నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు వెళ్లే రిపోర్టర్లను సైతం అనుమతించకపోవడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందన్న చర్చ స్థానికంగా సాగుతోంది.

పనులు ముమ్మరం..

ప్రధాన ఆలయం గర్భగుడి, విజయగణపతి, సరస్వతి ఆలయం, శ్రీశుభానందదేవి(పార్వతి), శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయాల పునాది పనులు చివరి దశకు చేరుతున్నాయి. ప్రధాన ఆలయం ముఖ మండపం, శుభానందదేవి ఆలయ ముఖమండపాల పునాది పనులు సాగుతున్నాయి. పడమర వైపున ప్రాకారాల పునాది పనులు జరుగుతున్నాయి. మిగిలి ఉన్న ఉత్తర, దక్షిణ ప్రాకారాల కూల్చివేతలు సాగుతున్నాయి. దక్షిణ ఆగ్నేయంలో రామాలయం నిర్మాణం జరుగనుంది. తూర్పు ఈశాన్యంలో సూర్యదేవాలయం నిర్మాణం జరుగుతుందని అధికారుల ద్వారా తెలిసింది.

ఏర్పాట్లేవి..

టెండర్‌ దుకాణ వ్యాపారులకు బాలాలయం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు గుంజలు వేసి పందిరి ఏర్పాటు చేసి వదిలేయడంతో రేకులు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం దుకాణం భద్రత లేకుండా ఉండడంతో నిర్మాణ ప్రాంతానికి వెళ్లే అవకాశం లేక పలువురు దుకాణాలను మూసివేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దక్షిణ ఆగ్నేయం వద్ద తొలగిస్తున్న ప్రాకారం

కంచెతో తంటా..

నాగేంద్రస్వామి ఆలయం సమీపం పడమర ద్వారం నుంచి తూర్పు గోపురం వరకు భారీగా కంచె ఏర్పాటుకు గోతులు తవ్వి ఇనుప ఫోల్స్‌ వేస్తున్నారు. ఇప్పటికే పూర్వం రహదారిని మూసివేసేందుకు కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధమవుతున్నారు. తూర్పు గోపురం ఎదుట టెండర్‌ ద్వారా దుకాణాలకు కూడా అడ్డంగా ఇనుప ఫోల్స్‌ ఏర్పాటు చేసి మట్టి కుప్పలు పోశారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఈఈ మనోహర్‌ను ఫోన్‌లో సంప్రదించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిర్మాణ ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించడం లేదని తెలిపారు. దేవస్థానంలో చేపడుతున్న నిర్మాణ పనులు ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఉన్నాయని ఈఓ మహేష్‌ బదులిచ్చారు. అందుకే తమకు అనుమతి ఇచ్చే అధికారం లేదన్నారు.

సింగరేణి డైరెక్టర్‌ కొప్పుల వెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement