మండలాల వారీగా భూగర్భ నీటిమట్టం (మీటర్లలో)..
ఎల్‌నినో ప్రభావంతో అడుగంటిన భూగర్భ జలాలు
భూపాలపల్లి: కాకతీయులు నిర్మించిన చెరువులు, వాగులు వంకలతో రెండు పంటలు సమృద్ధిగా పండే ఈ ప్రాంతంలో కరువు మేఘాలు కమ్ముకోనున్నాయి. ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వరదనీరు రాక జలాశయాలు వెలవెలబోతుండటంతో జిల్లాలో యాసంగి పంటల సాగు కష్టతరమేని అనిపిస్తోంది. ఊహించని రీతిలో కరువు ఏర్పడబోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సాగుకు వాగులు, చెరువులపైనే ఆధారం..
జిల్లాలోని రైతులు ఎక్కువగా రిజర్వాయర్‌లు, చెరువులు, వాగులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో మానేరు, మోరంచ, చలివాగు, బొగ్గులవాగు ప్రతీ ఏటా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వాగులపై ఆధారపడి మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్, కాటారం, భూపాలపల్లి మండలాలకు చెందిన రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వాగుల్లో వరద దాటికి పంట పొలాలు సైతం నీటమునుగుతున్నాయి. వానాకాలంలో వరద నీటితో సాగుచేస్తూ, యాసంగిలో వాగులో, పక్కనే వేసుకున్న బోర్లతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఆయా వాగుల నుంచి పెద్దగా వరద ప్రవాహం ఏమీ రాలేదు. దీంతో వానాకాలం పంటల సాగుకే ఇబ్బంది తలెత్తగా, యాసంగిలో సాగుపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు.
సగటున 2.67 మీటర్ల లోతుకు నీరు..
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. పెద్దగా వరద నీరు రాకపోవడంతో చిన్నచిన్న చెరువులు సైతం నిండలేదు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలోని చిట్యాల మినహా అన్ని మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 2025 సెప్టెంబర్ నెలలో జిల్లావ్యాప్తంగా సరాసరిగా 7.11 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఈ నెలలో 9.78 మీటర్ల లోతులో.. 2.67 మీటర్లకు తగ్గాయి. కాటారం మండలంలో అత్యధికంగా 26.21 మీటర్ల లోతుకు పడిపోగా, తరువాత స్థానంలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాలు ఉన్నాయి.
సాగు జరిగేనా..
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 1.12 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేస్తుండగా, యాసంగిలో సుమారు 98వేల ఎకరాల్లో ప్రతీఏటా సాగు జరుగుతుంది. యాసంగిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పాటు కూరగాయలు సాగు చేస్తుంటారు. ఈసారి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లతో సైతం సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఊహించని రీతిలో సాగు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పై ఫొటోలో కనిపిస్తున్నది కాకతీయులు నిర్మించిన గణపసముద్రం. ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 31 అడుగులు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ రిజర్వాయర్‌లోకి పెద్దగా వరద నీరు చేరలేదు. దీంతో రామప్ప చెరువు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రానికి నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం 20.8 అడుగుల నీటిమట్టం ఉంది. ఆ నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు తాగునీరు అందిస్తున్నారు. దీంతో మరో రెండు, మూడు నెలల్లో గణపసముద్రం సైతం అడుగంటిపోనుంది. ప్రతీ ఏటా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడి యాసంగిలో అధికారికంగా సుమారు 3,150, అనధికారికంగా మరో మూడు వేల ఎకరాల సాగు జరిగేది. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో నీటి ఎద్దడి కారణంగా తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో యాసంగికి సాగునీరు అందే అవకాశాలు కనిపించడం లేదు.
మండలం 2025 ప్రస్తుతం
(సెప్టెంబర్)
భూపాలపల్లి 7.48 11
చిట్యాల 4.33 2.49
గణపురం 3.17 6.77
కొత్తపల్లిగోరి 3.00 4.50
కాటారం 17.36 26.21
మహదేవపూర్ 10.06 13.26
మహాముత్తారం 0.91 3.05
మల్హర్ 14.51 16.53
మొగుళ్లపల్లి 3.66 4.67
పలిమెల 6.63 9.27
రేగొండ 2.87 4.05
టేకుమట్ల 3.91 4.85
జిల్లా సరాసరి 7.11 9.78
కాటారంలో 26.21 మీటర్ల
లోతులో జలం
జలాశయాల్లోనూ
అంతంత మాత్రంగానే నీరు
మునుపెన్నడూ లేని రీతిలో
పడిపోనున్న సాగు


