న్యూస్‌రీల్
స్థిరమైన మద్దతు ధర ఉండాలి..
భూపాలపల్లి అర్బన్: దేశీయంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక రైతులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చే ముడి పామాయిల్ దిగుమతులపై సుంకాలు 16నుంచి 11శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదు శాతం సుంకాల కోత నిర్ణయం అమల్లోకి రావడంతో క్షేత్రస్థాయిలో తోటలు సాగుచేస్తున్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 3,649.57 ఎకరాల్లో 1,229 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు.
పెరుగుతున్న సాగు..
జిల్లావ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధికారులు సైతం గ్రామాల్లోని రైతులకు ఆయిల్‌పామ్ వైపు మళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 1,229మంది రైతులు 3,649.57 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగుచేశారు. ప్రస్తుతం కొంతమంది రైతులు ఇటీవలే గెలలను మద్దతు ధరకు విక్రయించారు. లాభాలు కనిపించడంతో మరింత మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం సుంకాలు తగ్గించడంతో గెలల ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సాగుచేస్తున్న రైతులు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో గెలల ధరలు మరింత తగ్గితే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. ఈ సుంకాల తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, పాత సుంకాలను పునరుద్ధరించి గెలలకు గ్యారెంటీ మద్దతు ధర కల్పించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
పడిపోనున్న గెలల ధరలు..
విదేశాల నుంచి పామాయిల్ ముడిచమురు తక్కువ సుంకంతో దేశంలోకి ప్రవేశిస్తే, స్థానిక మార్కెట్‌లో తాజా ఆయిల్‌పామ్ గెలలకు డిమాండ్ పడిపోనుంది. ప్రస్తుతం ధర మాత్రం ఆల్‌టైం రికార్డుగా ఉంది. గెల టన్నుకు రూ.24,025 ధర పలుకుతోంది. గత నెల 24 నుంచి సుంకాలు తగ్గించడంతో ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం గెలలను రైతుల వద్ద నుంచి తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దిగుమతి సుంకం తగ్గడంతో ప్రాసెసింగ్ కంపెనీలు దేశీయ రైతుల వద్ద కొనుగోలు చేసే గెలల ధరలను గణనీయంగా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతికూల ప్రభావం ఈ నెలలో గెలల కొనుగోలు ధరలపై తీవ్రంగా పడనుంది.
దిగుమతిపై సుంకం 16నుంచి
11శాతానికి తగ్గింపు
విదేశీ ముడి పామాయిల్
వచ్చే అవకాశం
గెలల ధరలపై ప్రభావం
జిల్లాలో 3,649.57 ఎకరాల్లో సాగు
రైతుల్లో ఆందోళన
సంప్రదాయ పంటల్లో నష్టాలు వస్తున్నాయని అధికారుల మాట విని ఆయిల్ పామ్ సాగు మొదలు పెట్టాను. డ్రిప్, ఎరువులతో ఇప్పటికే భారీగా ఖర్చయింది. పంట చేతికొచ్చే సమయంలో కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా గెలలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలి. ధరను స్థిరంగా ఉంచాలి.
– పుల్లూరి శ్రీధర్,
పామాయిల్ రైతు, చిట్యాల


