‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ షురూ | - | Sakshi
Sakshi News home page

‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ షురూ

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

మల్హర్‌ (కాటారం): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాటారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పంతకాని తిరుమల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌’ పథకాన్ని సోమవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో చైర్‌పర్సన్‌, సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు ప్రారంభించారు. గంగారం మోడల్‌ స్కూల్‌లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత మెరుగుపడటంతో పాటు పాఠశాల హాజరు శాతం, విద్యా ప్రగతి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌కు సౌరవిద్యుత్‌ అనుసంధానం

చిట్యాల: మండలకేంద్రంలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌కు రెండు మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి అనుసంధానం చేసినట్లు భూపాలపల్లి సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ నాగెల్లి సదానందం పేర్కొన్నారు. సోమవారం చిట్యాల సబ్‌స్టేషన్‌ను సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఎం కుసుమ్‌ ఏ పథకం ద్వారా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి మరో ముందడుగు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు సౌర విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా స్థానికంగా విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ దోహదపడుతుందని అన్నారు. ఈ పథకం మూలంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతూ, పర్యావరణహితమైన, స్థిరమైన విద్యుత్‌ ఉత్పత్తికి టీజీఎన్‌పీడీసీఎల్‌ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ జగదీశ్‌, ఏడీఈ పి.సుందర్‌కుమార్‌, ఏఈ చంద్రశేఖర్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లాభాల వాటా

వెంటనే చెల్లించాలి

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను తేల్చి 40శాతం వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ బ్రాంచ్‌ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.59వేల కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఏరియాలోని వివిధ గనుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గని మేనేజర్లకు సోమవారం మెమోరాండాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, రవికుమార్‌, సదానందం, నరేష్‌, రాజారాం, ఆసిఫ్‌పాషా, మల్లికార్జున్‌, దోర్నాల తిరుపతి, నల్ల సత్తి, జే.రాజు, ప్రవీణ్‌, పి.శ్రీనివాస్‌, గణేష్‌, తోడే రాజన్న, ఎస్‌.కృష్ణమూర్తి, నూకల చంద్రమౌళి, ఎల్‌.శంకర్‌, జగత్‌రావు పాల్గొన్నారు.

పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ

భూపాలపల్లి రూరల్‌: జిల్లాకు చెందిన గిరిజన యువతీ, యువకులకు పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్‌ వత్సల్‌ టోప్పో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల సాధనకు ఎంపికయ్యేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని,అర్హత కలిగిన గిరిజన యువత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, స్టడీ సర్టిఫికెట్లు, పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పత్రం ప్రతితో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు పోలీసు రిక్రూట్‌మెంట్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, ఆసక్తి, అర్హత ఉన్న వారు అక్టోబర్‌ 9న సాయంత్రం 5 గంటల్లోగా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement