భూపాలపల్లి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఇకపై మీ ప్రమాణం యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. మీ ప్రమాణం హాజరు యాప్ వినియోగంపై సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఈ విధానాన్ని వచ్చే వారం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సమయపాలన, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో ఈ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పని చేస్తున్న ప్రతి అధికారి, ఉద్యోగి యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. యాప్ వినియోగం, హాజరు నమోదు ప్రక్రియపై ఈడీఎం శ్రీకాంత్ అధికారులకు అవగాహన కల్పించారని, సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే ఈడీఎంను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఈడీఎం శ్రీకాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కార్మికుల పక్షపాతి వెంకటస్వామి..
కార్మికులు, పేదల సంక్షేమానికి మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకటస్వామి జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజనీతిజ్ఞుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు ఆదర్శనీయమన్నారు.
అర్జీలను పరిష్కరించాలి..
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన 85మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని, పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


