భూపాలపల్లి రూరల్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న స్వీపర్, స్కావెంజర్, హెడ్ కుక్, అసిస్టెంట్‌కుక్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 17న సాయంత్రం 3గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. టేకుమట్ల మండలంలో స్వీపర్ అండ్ స్కావెంజర్, పలిమెలలో హెడ్‌కుక్, గణపురం, మల్హర్, మొగుళ్లపల్లి మండలాల్లో అసిస్టెంట్ కు క్, మొత్తం 5 పోస్టులు ఉన్నాయని తెలిపారు. జిల్లావాసులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
రోడ్ల అభివృద్ధికి
నిధుల మంజూరు
మల్హర్: కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్ మండలం తాడిచర్ల, కాటారం, మాహాముత్తారం, మహదేవపూర్ మండలంలోని రోడ్ల అభివృద్ధికి హ్యామ్ పథకం కింద రూ.141.63 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొయ్యూరు నాగులమ్మ క్రాస్ నుంచి తాడిచర్ల(12.92 కిలోమీటర్లు) వరకు రూ.15.02 కోట్లు, తాడిచర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి (2.50 కిలోమీటర్లు)వరకు రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి. కాటారం మండలం ప్రతాపగిరి నుంచి బొప్పరాం(8 కిలోమీటర్లు) వరకు రూ.7.02 కోట్లు, మహాముత్తారం మండలం పెగడపల్లి నుంచి మేడారం(19.20 కిలోమీటర్లు) వరకు రూ.22.23కోట్లు, మహదేవపూర్ నుంచి ముకునూర్ వరకు 30 కిలోమీటర్లకు వరకు డబుల్ రోడ్డు, 20 కిలోమీటర్లు సింగిల్ లేయర్ (మొత్తం 52 కిలో మీటర్లు)కు రూ 95.17 కోట్లు నిధులు మంజూరయ్యాయి.
రూ.5కోట్లు మంజూరు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం చండ్రుపల్లి–నాగేపల్లి గ్రామాల నడుమ వాగుపై ప్రతీ వర్షకాలంలో లో లెవల్ వంతెనతో వరదనీరు చేరి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చండ్రుపల్లి వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హ్యామ్ నిధులు నుంచి రూ.5కోట్లు ఆర్‌అండ్‌బీ శాఖకు మంజూరు చేశారు. త్వరలో టెండర్ పూర్తయి నిర్మాణం జరుగుతుందని సోమవారం కాటారం పర్యటనలో మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏఎన్‌ఎం పోస్టుకు
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్ గర్‌ల్స్ హాస్టల్‌లో ఒక ఏఎన్‌ఎం పోస్టును భర్తీ చేయుటకు ఈనెల 17 తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
లాడ్జిల తనిఖీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని లాడ్జిలను సీఐ ఎన్.వెంకటేశ్వర్లుతో పాటు కాళేశ్వరం, మహదేవపూర్, పలిమెల ఎస్సైలు జి. తమాషారెడ్డి, సాంబమూర్తి, శశాంక్, భగవత్ తమ బృందాలతో మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో లాడ్జి యజమానులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో లాడ్జిల నిర్వహణకు అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలని, వివరాలు పక్కగా మెంటెయిన్ చేయాలని తెలిపారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ‘ఎవరొచ్చి..పోతున్నారు’ అనే శీర్షికన వచ్చిన కథనంతో పోలీసులు స్పందించి తనిఖీలు చేశారని తెలిసింది. ఈ క్రమంలో తనిఖీలు, ఇతర ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో సివిల్ పోలీసులు, టీజీఎస్‌పీ సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. హిందీ పోస్టుకు హిందీ సబ్జెక్టుతోపాటు బీఏ లేదా బీఓఎల్ హిందీ ప్రవీణ/విధ్వాన్ లేదా ఎంఏ హిందీతోపాటు బీఈడీ లేదా ప్రచారక్ లేదా శిక్షణా కళా ప్రవీణ డిప్లొమా లేదా హిందీపండిట్ కలిగి ఉండాలన్నారు.


