● ఎస్పీ సరిశెట్టి సంకీర్త్
మల్హర్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, నిష్పాక్షికంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సిబ్బందికి సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసుల వాహనాల పరిష్కార పురోగతిపై ఆరా తీశారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదుచేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ె పెపండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించి, దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దర్యాప్తు వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ తనిఖీలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, కొయ్యూరు ఎస్సై మహేందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


