భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్‌హాల్‌లో చైర్మన్ బుర్ర కొమురయ్య అధ్యక్షత శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదించిన వివిధ అంశాలకు సంబంధించిన ఎజెండాలను పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపట్టాలని అధికారులకు సమావేశం ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అఽధికారులు, పాలకసభ్యులు, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం
మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధికారులు హాజరుకాకుండా, మండలస్థాయి అఽధికారులు హాజరుకావడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ ద్వారా అధికారులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఉదయ్‌కుమార్‌ను ఆదేశించారు.
సమావేశంలో సమస్యల వెల్లువ
● 4వ వార్డులో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి నూతన మీటర్లు ఏర్పాటుచేయడం లేదని 4వ వార్డు కౌన్సిలర్ కన్నం యుగేందర్ అన్నారు.
● అదనపు భారం పడుతున్నా నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీష్ అన్నారు.
● గాంధీకాలేజ్ రోడ్డులో సీసీ రోడ్డు చివరలో విద్యుత్ స్తంభాలను తొలగించాలని 19వ వార్డు కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ కోరారు.
● తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంజూర్‌నగర్, పుల్లూరిరామయ్యపల్లికి వెళ్లే పైపులైన్ నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తాగునీటి లైన్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ గండ్ర హరీశ్‌రెడ్డి అన్నారు.
● విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అదనంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, 2డీకో, ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, పుల్లూరిరామయ్యపల్లిలో పాత వాటర్ ట్యాంక్, పాఠశాల భవనం తొలగించి అంగన్‌వాడీ కేంద్రం నిర్మించాలని 9వ వార్డు కౌన్సిలర్ అప్పం కిషన్ కోరారు.
● రోడ్డుకు అడ్డంగా ఉన్న సపోర్ట్ విద్యుత్ స్తంభాలు తొలగించాలని 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్ కోరారు.
● జిల్లా కేంద్రంలో 24 గంటలు బెల్ట్ షాపులలో అమ్మకాలు, విచ్చలవిడిగా గుడుంబా తయారీతో మహిళలు, చిన్నారులు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని 5, 11, 12, 13, 18 వార్డు కౌన్సిలర్లు పూర్ణచందర్, రాజు, బొంతల సతీష్, బడితెల వెంకటస్వామి, సహదేవ్ తెలిపారు.
● కాకతీయకాలనీ నుంచి గడ్డిగానిపల్లి వరకు విద్యుత్ దీపాలు వెలగడం లేదని 1వ వార్డు కౌన్సిలన్ బౌతు శోభ అన్నారు.
● కార్మిక కాలనీలో మురికి కాలువలు దుర్వాసన వస్తున్నాయని, సక్రమంగా కాలువలు శుభ్రం చేయడం లేదని, చెత్త సేకరణ చేయడం లేదని 8, 16, 5, 28వ వార్డుల కౌన్సిలర్లు రాధ మంజుల, రేణుక నరేందర్ తెలిపారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు
ప్రశాంతంగా మున్సిపల్
సర్వసభ్య సమావేశం
సమస్యలను కౌన్సిల్ దృష్టికి
తీసుకువెళ్లిన కౌన్సిలర్లు


