● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: ప్రజల భద్రత దృష్ట్యా నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో నాణ్యమైన, శాసీ్త్రయ దర్యాప్తు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేసును సకాలంలో నమోదు చేసి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పారదర్శకత, సమాచార సమన్వ యం, ప్రజలకు అందించే సేవల నాణ్య తను మరింత మెరుగుపరచాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.


