భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సేఫ్టీ కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు సంయుక్తంగా సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందజేశారు. సానిటేషన్ కార్మికులు విధి నిర్వహణలో సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి కిట్‌లో హెల్మెట్, రెయిన్‌కోట్, సేఫ్టీ షూస్, అప్రాన్, గ్లౌజులు ఉన్నాయి. పరిశుభ్రత నిర్వహణలో సానిటేషన్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని, వారి భద్రతకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం
భూపాలపల్లి: రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున రైతులను నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవగాహన కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వనమహోత్సవం, రేషన్ కార్డుల పంపిణీ, చేయూత పింఛన్లు, విద్యార్థులకు యూనిఫాంలు, కుట్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి సీసీఎఫ్ ప్రభాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
114 పోస్టుల భర్తీకి
ఇంటర్వ్యూలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల్లో 10 కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు, 21 అసోసియేట్ ప్రొఫెసర్లు, 39 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 44 సీనియర్ రెసిడెంట్ల పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 17వ తేదీన భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఖాళీల వివరాలు, అర్హతలు తదితర పూర్తి సమాచారం కళాశాల వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మద్యం మత్తులో ఆత్మహత్య
చిట్యాల: మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని లక్ష్మీపూర్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం లక్ష్మీపూర్ తండాకు చెందిన బానోత్ భద్రునాయక్ (56) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఆయన భార్య జ్యోతి కిటికీలో నుంచి చూడగా.. ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే వచ్చి తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతిడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రమాదాలపై అవగాహన ఉండాలి
ఏటూరునాగారం: ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ విపత్తు దళం ఇన్‌స్పెక్టర్ బీటెన్ సింగ్, కానిస్టేబుల్ చిన్ని రాము అన్నారు. శుక్రవారం మండలంలోని రామన్నగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విపత్తులపై ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా బీటెన్ సింగ్ మాట్లాడుతూ గుండెనొప్పి వచ్చినప్పుడు సీపీఆర్ చేయాలని కృత్రిమ బొమ్మద్వారా వివరించారు. నీరు, అగ్ని, వరదలు, వాగులు ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


