15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు విడుదల
● 248 పంచాయతీలకు రూ.11.30కోట్లు
● తాగునీరు, పారిశుద్ధ్య పనులకే
ప్రాధాన్యం
భూపాలపల్లి: కొంతకాలంగా నిధుల కొరతతో రోజువారీ నిర్వహణ సవాళ్లను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు ఊరట లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనుల నిర్వహణకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించింది.
సమస్యలు తక్షణ పరిష్కారం..
జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా కేంద్రం రూ.11.30 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ గ్రాంట్‌లు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ కానున్నాయి. కేంద్రం నిధులు అందించడంతో పల్లెల్లో నిలిచిపోయిన ప్రాథమిక, అత్యవసర సేవలకు మళ్లీ జీవం పోసినట్లయింది. కొన్ని నెలలుగా చిన్నచిన్న పంచాయతీల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, తాగునీటి మోటార్ల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, చెత్త సేకరణ వాహనాల ఇంధనం తదితర వ్యయాలకు ఆర్థిక ఇబ్బంది నెలకొంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో ఆయా సమస్యలు పరిష్కారం కానున్నాయి.
ప్రతీ రూపాయికి ‘డిజిటల్’ లెక్క..
15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికాబద్ధమైన, పారదర్శకమైన వ్యయానికి మాత్రమే కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. పంచాయతీల్లో చేపట్టే ప్రతి పని, దానికి సంబంధించిన నిధుల వినియోగ వివరాలను తప్పనిసరిగా డిజిటల్ విధానంలో (ఆన్‌లైన్ పోర్టల్‌లో) నమోదు చేయాల్సి ఉంటుంది. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ వ్యయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రజల అత్యవసరాలు, కనీస సౌకర్యాల కల్పనకే ఈ గ్రాంట్లను వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
మండలాల వారీగా విడుదలైన నిధులు
మండలం జీపీలు నిధులు
భూపాలపల్లి 26 రూ.1,10,41,478
రేగొండ 23 రూ.1,16,60,128
చిట్యాల 26 రూ.1,13,24,367
గణపురం 17 రూ.1,08,15,827
మొగుళ్లపల్లి 26 రూ.1,05,78,302
టేకుమట్ల 25 రూ.83,35,436
కొత్తపల్లి గోరి 16 రూ.56,31,237
కాటారం 24 రూ.1,29,26,867
మహాముత్తారం 24 రూ.1,00,24,684
మహదేవపూర్ 18 రూ.98,31,841
మల్హర్ 15 రూ.79,66,502
పలిమెల 8 రూ.28,25,202


