కాళేశ్వరం: ఇటీవల సోషల్ మీడియా వేదికగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆలయ అర్చకులు భావోద్వేగానికి గురయ్యారని, ఆలయ కూల్చివేతను వ్యతిరేకిస్తున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, అర్చకులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఆలయ పునర్నిర్మాణం విషయంలో బాధ, ఆవేదన, భావోద్వేగానికి గురికాలేదని వెల్లడించారు. వేల సంవత్సరాల చారిత్రక, ఆధ్యాత్మిక వైభవం కలిగిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయం మరింత వైభవంగా, శాస్త్రోక్తంగా, కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడంగా పునర్నిర్మాణం కావడం తమ అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
గోరింటాకు సంబురం
మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ఆదర్శనగర్ కాలనీలో శుక్రవారం మహిళలు అమ్మవారికీ పూజల అనంతరం చేతులకు గోరింటాకును పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ నగర్ కాలనీ మహిళా అధ్యక్షురాలు ముస్కులా శ్రీలత రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో మహిళలు, యువతులు గోరింటాకు పెట్టుకోవడం ఆనందానికి, శుభానికి, కుటుంబ ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. నేటి ఆధునిక జీవనశైలిలోనూ మన పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలను మరువకుండా భావితరాలకు అందించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు రసాయనాలతో తయారైన నకిలీ మెహందీ ఉత్పత్తుల కంటే సహజ గోరింటాకుకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


