● ఈ నెల 16న జిల్లాకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక
● పంచాయతీరాజ్ హమ్ రోడ్ల పనులకు ఇక్కడి నుంచే శ్రీకారం
● రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క
ములుగు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న జిల్లాలో పర్యటించనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీ రాజ్ హమ్ రోడ్ల పనుల కార్యక్రమానికి సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకొని, అనంతరం ములుగు చేరుకొని పైలాన్ ప్రారంభించడమే కాకుండా ఇంచర్ల గ్రామ శివారులో రూ.7 కోట్లతో నిర్మించిన ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని వర్చువల్, నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అభివృద్ధి పనుల వివరాలను అన్ని శాఖల అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు.


