భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సింగరేణి జీఎం కార్యాలయం వైపు వెళ్లే రహదారి విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ వ్యాపారులు శుక్రవారం ప్రధాన రహదారిపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వ్యాపారులు మాట్లాడుతూ.. రహదారిని విస్తరించకపోవడం, డ్రెయినేజీ నిర్మాణం చేయకపోవడం మూలంగా రోడ్డుపై నీరు నిలిచి కుంటలను తలపిస్తోందన్నారు. వర్షాకాలంలో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలు, చిన్నారులు నడిచి వెళ్లే క్రమంలో వాహనాలు వెళ్తే బురద నీరు మొత్తం వారిపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి మీదుగా పోలీస్‌స్టేషన్, జిల్లా పోలీసు, జీఎం కార్యాలయం, సింగరేణి స్టేడియం, జీఎం కార్యాలయానికి ప్రతీరోజు వందలాది వాహనాలు వెళ్తాయని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యాపారులు, స్థానికులు ఎగ్గేటి కుమార్, తేలి శ్రీనివాస్, రఘు, పరశురాం, వేణు, సమ్మయ్య, తేలి సంజీవ్, శ్రీనివాస్, శశిధర్, ఖాదర్ పాల్గొన్నారు.


