తగ్గిన వరి సాగు
భూపాలపల్లి రూరల్: ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగు గణనీయంగా పడిపోగా.. పత్తి పంట మాత్రం కొంత ఊరటనిచ్చే స్థాయిలో ముందుకు సాగుతోంది. వర్షాభావ పరిస్థితులతో సాగు అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జూన్‌లో కురిసిన చినుకులతో రైతులు ఉత్సాహంగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. జూలై నెలాఖరు వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైంది, దీంతో వరి నాట్లు సాగుతున్నాయి. నీరులేని రైతులు పొలాలను బీళ్లుగా వదిలిపెట్టారు.
వరి సాగు డీలా.. పత్తికే మొగ్గు..
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం..ఈ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 2,16,734 ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. ఇందులో వరి 1,12,547 ఎకరాల్లో.. పత్తి 1,01,230 ఎకరాల్లో సాగవుతుందని భావించారు. కానీ ఎల్‌నినో ప్రభావం, ఎండలతో పరిస్థితి మారింది. ఇటీవల కురిసిన అడపాదడపా చిరు జల్లులతో ప్రస్తుతం ఇప్పటివరకు 48,866 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడిని తట్టుకునే పత్తి పంటను రైతులు ఎక్కువగా ఆశ్రయించారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 1,09,132 ఎకరాలకు చేరుకుని అంచనాలను మించింది. కంది, పెసర, మినుము పంటలతో కలిపి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,65,589 ఎకరాల్లో సాగు నమోదైంది.
పచ్చగా పత్తి చేలు..
వరి సాగు నిరాశ పరిచినప్పటికీ, సాగు చేసిన పత్తి చేలు మాత్రం ఇటీవల కురిసిన జల్లులకు ఏపుగా పెరుగుతున్నాయి. భూపాలపల్లి, కాటారం, చిట్యాల, టేకుమట్ల, రేగొండ తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి చేలలో గుంటకలు తోలడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. మరో నెల రోజుల్లో రెండు మూడు మంచి వర్షాలు కురిస్తే పత్తి దిగుబడి చేతికి వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. వరి నార్లు పోసుకున్న రైతులు ఈ నెల 15 వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉందని.. నీటి లభ్యత లేని పక్షంలో వ్యవసాయ శాఖ సూచించిన విధంగా కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే మేలని అధికారులు సూచిస్తున్నారు.
పెరిగిన పెసర సాగు..
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులు పెసరపంటకు ప్రాధాన్యం ఇచ్చారు. ఐదు సంవత్సరాలలో జిల్లాలో 250 ఎకరాలకు పైగా సాగు కాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 3,369 ఎకరాల్లో సాగైనట్లు, పెసర సాగు మరింత పెరిగేఅవకాశం ఉన్నట్లుఅధికారులు చెబుతున్నారు.
తలకిందులైన వానాకాలం అంచనాలు
పత్తికి అనుకూలంగా వాతావరణం
1,09,132 ఎకరాల్లో పత్తి సాగు
3,369 ఎకరాల్లో పెసర


