కాళేశ్వరం: కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న వారందరూ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దీంతో భారీగా అప్లికేషన్లు రానున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో ఎక్కువగా పింఛన్ల మంజూరు కోసం ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఎంతోమంది వితంతువులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు అర్హులందరూ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
స్పష్టత ఏది..
ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని సూచనప్రాయంగా ప్రభుత్వం ప్రకటించింది. మొదట వితంతు, దివ్యాంగులుకు మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పింఛన్ పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్న పింఛను పెంచకపోగా కొత్త పింఛన్ల మంజూరుపై జాప్యం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు కొత్త పింఛన్ల మంజూరు లేకపోయినా సదరం క్యాంపులు నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా పింఛన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు.
పెండింగ్ దరఖాస్తులు
జిల్లావ్యాప్తంగా 3,862 వృద్ధాప్య, 3,101 వితంతు, 1,110 దివ్యాంగులు, 361 కల్లుగీత కార్మికులు, 163 నేత కార్మికులు, 37 ఫైలేరియా, 58 డయాలసిస్, 1,194 మంది ఒంటరి మహిళలు, 47మంది బీడీ కార్మికులు పింఛన్ పొందుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 176 వరకు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి.
పెన్షన్లపై ప్రభుత్వం ప్రకటన చేసినా.. జీఓ మాత్రం ఇవ్వలేదు. పింఛన్ల గురించి ఉన్నతాధికారులు ఆరా తీయలేదు. ఎంపీడీఓల వద్ద దరఖాస్తులు ఆధారంగా రిపోర్టు ఉంది.
– బాలకృష్ణ, డీఆర్‌డీఏ
ప్రభుత్వ ప్రకటనతో
భారీగా రానున్న అప్లికేషన్లు
జిల్లాలో 176 పెండింగ్ దరఖాస్తులు


