● జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్
మొగుళ్లపల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మధుసూదన్ సూచించారు. బుధవారం మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పిడిసిల్ల, మొట్లపల్లి ఉపఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికలు, వైద్య రికార్డులు పరిశీలించిన ఆయన చిన్నారులకు అందిస్తున్న టీకాల (వ్యాక్సినేషన్) కార్యక్రమం పురోగతిని సమీక్షించి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు నాణ్యంగా అందించేలా ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలో ఫార్మసీ, నర్సింగ్ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో జ్వరాలపై నిరంతర నిఘా ఉంచి, అనుమానిత కేసులను వెంటనే గుర్తించి అవసరమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగరాణి, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


