భూపాలపల్లి రూరల్: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆరుతడి పంటలన్నీ జీవం పోసుకున్నాయి. ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో అన్నదాతలు కష్టాలు గట్టెక్కినట్లే. కురిసిన వర్షాలు పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు మేలు చేకూర్చాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 152.9 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 120.8 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 322.9 మి.మీకు 367.8 మి.మీ నమోదైంది. గతనెలలో 14శాతం అధికంగా, ఈ నెలలో 41.7మి.మీలకు 63.6 నమోదుకాగా.. ఇప్పటివరకు 53 శాతం అధికంగా వర్షం కురిసింది.
రెండు మండలాల్లో తక్కువ
జిల్లాలో ఈ నెలలో నాలుగు రోజుల్లో కాటారం, గణపురం మండలాల్లో మాత్రమే కాస్త తక్కువ వర్షపాతం నమోదైంది. మహాముత్తారం, మల్హర్, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. మహదేవపూర్, పలిమెల, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 మండలాల్లో 4 మండలాల్లో సాధారణ వర్షపాతం.. 2 మండలాల్లో కాస్త తక్కువ, 6మండలాల్లో ఎక్కువ వర్షపాతం కురిసింది.
పూత, కాత దశలో పెసర, కంది..
జూన్ మధ్య మధ్యలో వర్షాలు కురవడం, జూలైలో సైతం అప్పుడప్పుడు కురిసిన చినుకులతో పెసర, కంది పంటలకు మంచి మేలు చేకూరింది. ప్రస్తుతం ఈ రెండు పంటలు పూత, కాత దశలో ఉన్నాయి. మృగశిర కార్తెకు రెండు రోజుల ముందు కురిసిన వర్షాలకు కొందరు రైతులు పెసర, మినుము విత్తుకోగా ఆ పంటలు ప్రస్తుతం కాతదశకు వచ్చాయి. తర్వాత వేసిన కమతాల్లోని పంట పూత, అక్కడక్కడా కాత దశలో ఉన్నాయి. పెసర, కంది స్వల్పకాలికాలు కావడంతో 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇప్పటికే 45నుంచి 50రోజుల కాలం అవుతుంది. మరో 25 రోజుల్లోపు పెసర, కంది పంటలు నూర్పిళ్లు చేసుకోనున్నారు. ఈ సారి వాతావరణం ఇలాగే అనుకూలిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
ముసురుతో ఆరుతడి పంటలకు మేలు
రెండు మండలాల్లో తక్కువ,
6మండలాల్లో అధిక వర్షపాతం నమోదు
ఏపుగా పెరిగిన పత్తి చేలు


