కోటగుళ్లలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి పెద్దఎత్తున వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

డి గ్రీలో ప్రవేశాలకు

చివరి అవకాశం

భూపాలపల్లి అర్బన్‌: డిగ్రీ దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ ప్రవేశాలకు ఈ నెల 11వ తేదీ వరకు చివరి అవకాశం కల్పించినట్లు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 12వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే వీలు ఉందని పేర్కొన్నారు. రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవేశాలు పొందాలని ఆయన కోరారు.

లబ్ధికోసమే

తప్పుడు ప్రచారం

భూపాలపల్లి రూరల్‌: రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వంద పడకల ఆస్పత్రిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని భూపాలపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివారం ఆస్పత్రికి సెలవు అని తెలిసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఆస్పత్రిని సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆస్పత్రిలోని సమస్యలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిష్కరిస్తున్నారన్నారు. మూడు నాలుగు నెలల్లో ఆస్పత్రిలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఇస్రోకు ఎంపిక

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండలం ఆజాంనగర్‌ గ్రామానికి చెందిన కొరవేన అశోక్‌ కుమారుడు శ్రీనాథ్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బెంగళూరు(ఇస్రో)కు ఎంపికయ్యాడు. ఇస్రోలో నియామకాలలో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులతో పాటు గ్రామానికి సంబంధించిన పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీనాథ్‌ను అభినందిస్తున్నారు.

పరామర్శ

రేగొండ: కొత్తపల్లిగోరి మండలం చిన్నకొడేపాక గ్రామానికి చెందిన కేయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఒంటేరు రవీందర్‌ ఇటీవల మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు పరిశోధన పట్ల ఆసక్తిని పెంచడం వంటి అంశాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ శ్యాంబాబు, నాయకులు బాబు, శ్రీనివాస్‌, రాజేందర్‌, భిక్షపతి, చంటి, అశోక్‌, పైడి పాల్గొన్నారు.

రేపు మెగా జాబ్‌మేళా

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నెల 5న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లికి చెందిన హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటీస్‌ ఫౌండేషన్‌ సంస్థలో 72 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement