● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
డాక్టర్ మధుసూదన్
భూపాలపల్లి అర్బన్: ప్రతీ శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించడం అత్యంత ముఖ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 7వ తేదీ వరకు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ హాజరై మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తదితర శాఖల సమన్వయంతో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యం, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ సురేందర్, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ కవిత, డీడబ్ల్యూఓ మల్లేశ్వరి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగరాణి, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, బాలింతలు పాల్గొన్నారు.


