కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా కూల్చివేతలు కొనసాగుతోన్నాయి. ఈక్రమంలో శనివారం బస్డాండ్ వెనుక వీధి నుంచి వచ్చే రహదారిలో బ్యాంకు వద్ద, రాజరాజేశ్వర వసతి గృహం ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనాలు వచ్చేందుకు మాత్రమే దారి ఉంచారు. కానీ గ్రామంలో పశువులు, మేకలు, గొర్రెలు ఇదే దారి గుండా అడవికి వెళ్తుంటాయి. రైతులు కూడా ఇదే దారిలో తమ పంట చేనులకు, వ్యవసాయ పనులకు వెళ్తారు. వీరికి వంద గదుల గేటు నుంచి నుంచి దారి ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. మరో దారి సాధారణ ఘాటు నుంచి కుడి వైపు ఆలయానికి వచ్చేదారికి గేటు ఏర్పాటు చేసి తాళం వేశారు. పనులు జరుగుతున్నందున ప్రమాదాలు జరుగకుండా రహదారిని మూసివేసినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మెనూ ప్రకారం
భోజనం అందించాలి
మహాముత్తారం: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని డీటీడబ్ల్యూఓ నాగసాగర్ అన్నారు. శనివారం మండలంలోని మహాముత్తారం ఎస్టీ బాలుర వసతి గృహంతోపాటు పెగడపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనంతోపాటు నాణ్యమైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని టాయిలెట్లను పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గొల్లబుద్దారం గిరిజన ఆశ్రమ
పాఠశాల తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, హాస్టల్ నిర్వహణ, తరగతుల బోధన విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
చట్టాలపై అవగాహనతోనే
నేరాల నియంత్రణ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలను నియంత్రించవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో 102 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్‌పై అవగాహన కల్పిస్తూ, పోక్సో నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఉపాధ్యాయులు కీలక బాధ్యత వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, న్యాయవాదులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


