భూపాలపల్లి: రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాల నివారణ కోసం నియమాలు పాటించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం పోలీసు, రవాణాశాఖల ఆధ్వర్యంలో శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించాలని, సీటుబెల్ట్ వినియోగించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 50 వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీటీఓ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ నరేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
గత నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 2026 విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, బాల కార్మికులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి మొత్తం 48 మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. ఆరుగురు బాలికలు, 42 మంది బాలురు ఉన్నారని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జిల్లా పోలీసుశాఖతోపాటు కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, బాలల సంక్షేమ కమిటీ అధికారులు పాల్గొన్నట్లు ఎస్పీ సంకీర్త్ వెల్లడించారు.


