● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: తల్లి అందించే ముర్రుపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్ లాంటిదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు’ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లి తన బిడ్డకు ఇచ్చే మొట్టమొదటి కానుక పుట్టిన వెంటనే ముర్రు పాలు ఇవ్వడమేనని అన్నారు. ఈ సంవత్సరం ‘సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు– ఫలితాలను ఇచ్చే చర్యలను మరింత బలోపేతం చేయడం’అనే థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతాయని తెలిపారు. వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పించి తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖలసిబ్బంది పరస్పర సమన్వయంతో ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించి, తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలని సూచించారు. అప్పుడే జన్మించిన శిశువుకు ముర్రుపాలు పట్టించడం వల్ల భవిష్యత్‌లో కూడా అనారోగ్య సమస్యలు రాకుండా నివారించే అవకాశం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఎహెచ్‌ఓ మధుసూదన్, జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


