● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: 1950 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఓటు నమోదు వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రతీ ఓటరు తమ ఎన్నికల గుర్తింపు కార్డు నంబర్‌ను టైప్ చేసి 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయడం ద్వారా తమ ఓటు వివరాలను మొబైల్ ఫోన్‌కు సందేశం రూపంలో పొందవచ్చన్నారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని, అవసరమైతే సవరణలు, నమోదు ప్రక్రియలను సమయానికి పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఓటు హక్కు విలువను గుర్తించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
మత్స్యకారులు
చేపల వేటకు వెళ్లొద్దు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, వాగుల వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి వై.విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెరువులు, కుంటలు మత్తడి వరదకు ఎదురుగా జాలీలు, వలలు ఇతరత్రా నిర్మించరాదన్నారు. ఎవరైనా చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్ల వద్దకు వెళ్లి వరదల్లో చిక్కుకుంటే వారిని మత్స్యకారులు రక్షించాలన్నారు. మత్స్యకారులు తమ బాధ్యతగా రెస్క్యూటీంలో భాగం కావాలని సూచించారు.
సరస్వతి అమ్మవారి ఆలయం తొలగింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం శ్రీసరస్వతి అమ్మవారి ఆలయాన్ని తొలగించారు. దక్షిణం ప్రకారాన్ని తీసివేశారు. రాత్రి అభిషేక మండపం తొలగించనున్నారు. ఈ తొలగించిన ఇటుక, మట్టి ఇతర సామగ్రిని వీఐపీ ఘాటులోని గుడిమాన్యం స్థలంలోకి చేర్చుతున్నారు. ప్రధాన దేవాలయంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరుల లింగాలకు తొలగింపు ప్రక్రియలో ప్రమాదం లేకుండా ముందస్తుగానే ఇనుప కంచెలాగా బాక్స్ తయారుచేసి అమర్చారు.


