కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్–రక్సోల్–హైదరాబాద్ మధ్య సర్వీసులను పునరుద్ధిరించి నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. గతంలో రైళ్ల సర్వీసులను సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో చక్రధపూర్ డివిజన్‌లో మెగా రైల్వే బ్లాక్ కారణంగా రద్దు చేశారు. తిరిగి ఈ సర్వీసులను దసరా, దీపావళి, చాత్ పూజా పండుగలు ఉన్న దృష్య్టా ప్రయాణికుల సౌకర్యార్థం తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
రైళ్ల వివరాలు ఇలా..
అక్టోబర్ 8, 15, నవంబర్ 5, 12 తేదీల్లో హైదరాబాద్–రక్సోల్ (17005) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 11, 18, నవంబర్ 8, 15 తేదీల్లో రక్సోల్–హైదరాబాద్ (17006) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీసులకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు.


