‘సింగరేణికి తీవ్ర నష్టం’ | - | Sakshi
Sakshi News home page

‘సింగరేణికి తీవ్ర నష్టం’

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

భూపాలపల్లి అర్బన్‌: మణుగూరు పీకే ఓసీ డీప్‌ ప్రాజెక్టును సింగరేణి సంస్థకు కాకుండా జెన్కో ద్వారా టెండర్ల ప్రక్రియ చేపట్టడం సింగరేణి సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్యం పలుమార్లు కోరుతున్నప్పటికీ జెన్కోను పోటీలో నిలబెట్టి టెండర్ల ప్రక్రియ చేపట్టడం ద్వారా తాడిచర్ల–1 తరహాలో కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మణుగూరు పీకే ఓసీ డీప్‌ ప్రాజెక్టు సింగరేణికి దక్కితే మణుగూరు ప్రాంతంలో మరో 35 సంవత్సరాల పాటు ఉపాధి అవకాశాలు, బొగ్గు ఉత్పత్తి, ప్రాంతీయ అభివృద్ధికి భరోసా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలు, జెండాలు పక్కనపెట్టి సింగరేణి భవిష్యత్‌ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కార్మికులంతా ఏకమై తమ గళాన్ని వినిపించి మణుగూరు పీకే ఓసీ డీప్‌ ప్రాజెక్టును సింగరేణికే సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

భద్రతే విజయానికి మూలం

భూపాలపల్లి అర్బన్‌: గనుల్లో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయని, ఇదే క్రమశిక్షణతో భవిష్యత్‌లో మరిన్ని భద్రతా పురస్కారాలు సాధించాలని భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని కేటీకే–5వ గనిలో సందర్శించిన జీఎం అనంతరం ఉద్యోగులు, అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్వహించిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం–2025లో గ్రూప్‌–2 గనుల విభాగంలో కేటీకే–5వ గని శ్రీఓవరాల్‌ ఫస్ట్‌ ప్రైజ్ఙ్‌ సాధించిన సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. ఈ విజయం ప్రతీ ఉద్యోగి అప్రమత్తత, భద్రతా నిబంధనల పట్ల నిబద్ధత, సమష్టి కృషికి నిదర్శనమన్నారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ జట్టు స్ఫూర్తితో పనిచేస్తే భవిష్యత్‌లోనూ మరిన్ని అవార్డులు సాధించడంతో పాటు భూపాలపల్లి ఏరియా, సింగరేణి సంస్థకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్‌ మాచర్ల రమేష్‌, సేఫ్టీ ఆఫీసర్‌ పి.అభిషేక్‌, పిట్‌ ఇంజనీర్‌ శ్రీకాంత్‌, వెంటిలేషన్‌ ఆఫీసర్‌ రమేష్‌, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందీప్‌, కార్మిక సంఘాల నాయకులు వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

బిల్లులు చెల్లించడం

లేదని జీపీకి తాళం

మొగుళ్లపల్లి: గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నా.. తమ పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదని వేములపల్లి మాజీ సర్పంచ్‌ దంపతులు బెల్లంకొండ మాధవి–శ్యాంసుందర్‌రెడ్డి దంపతులు మంగళవారం జీపీ కార్యాలయానికి తాళం వేశారు. బెల్లంకొండ మాధవి సర్పంచ్‌గా ఉన్నప్పుడు గ్రామంలో రూ.14లక్షల రూపాయల వివిధ అభివృద్ధి పనులు చేశారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. పోలీసులు చేరుకుని తాళం తీపించారు.

చేప పిల్లలు మృతి

భూపాలపల్లి రూరల్‌: చెరువులో బ్లీచింగ్‌ పౌడర్‌ కలపడంతో కమలాపూర్‌ గ్రామంలోని పెద్ద చెరువులో చేపపిల్లలు మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చెరువులో వలుగారకం చేపలు (మాంసహారి) ఎక్కువగా ఉన్నాయి. సీడ్‌ వేస్తే వాటిని ఈ చేపలు తినేఅవకాశం ఉందని మత్స్యకారులు కొంతమంది నీటిలో బ్లీసింగ్‌ పౌడర్‌ కలిపినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చేప పిల్లలకు విషప్రయోగం ఏమీ జరగలేదన్నారు.

శాసీ్త్రయ కళల సందడి

గోవిందరావుపేట: శాసీ్త్రయ కళలు చిరకాలం నిలవాలంటే వాటికి పునాది ప్రభుత్వ పాఠశాలల్లోనే వేయాలని ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం కళాకారిణి కాట్రగడ్డ హిమాన్షి అన్నారు. మండల పరిధిలోని చల్వాయిలో గల తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో మంగళవారం ప్రిన్సిపాల్‌ గండు కుమార్‌ ఆధ్వర్యంలో స్పిక్‌ మేకే వారు నిర్వహించిన కార్యక్రమంలో పలు నృత్యాలను ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement