గణపురం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపురం మండలకేంద్రంలోని ప్రముఖ కాకతీయ కళాకేత్రం కోటగుళ్లు, పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం, రెడ్డి గుడి, గణప సముద్రం చెరువు కట్టపై ఉన్న దక్షణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, బుద్దారం పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంతో పాటు చెల్పూరు గ్రామంలోని సాంబశివ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
గోదావరి పుష్కరాల
భద్రతపై సమీక్ష
భూపాలపల్లి అర్బన్: గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ వీసీలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. పుష్కర ఘాట్‌ల వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర స్పందన బృందాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో పుష్కరాల సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ వీసీలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ నరేష్, అధికారులు పాల్గొన్నారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల
వివరాలపై విచారణ
మహాముత్తారం: మండలంలోని కోనంపేట మిషన్ భగీరథ ప్రాజెక్టులో అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగుల వివరాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి శనివారం కోనంపేటలోని పంప్‌హౌస్ వద్ద విచారణ చేపట్టారు. ఉద్యోగుల పూర్తి వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించినట్లు తెలిపారు. పరిశీలనలో ఎలాంటి అవకతవకలు, తప్పిదాలు లేవని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిషన్‌భగీరథ ఏఈ, డీఈ, ఈఈలు తదితరులున్నారు.
కాళేశ్వరం దేవస్థానం
టెండరు వాయిదా
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం టెండర్ వ్యవహారం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. శనివారం జరగాల్సిన టెండర్ బాంకుకు సంబంధించిన కారణాలతో మళ్లీ ఈనెల 27న (సోమవారం)కు వాయిదాపడినట్లు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేష్‌బాబు తెలిపారు.
‘ఎవరొచ్చి పోతున్నారు’ కథనంపై చర్చ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలవ్యాప్తంగా ‘ఎవరొచ్చి పోతున్నారు’ అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనంపై జోరుగా చర్చ జరిగింది. లాడ్జీల్లో నిర్వహణ నిర్లక్ష్యం, ఇతర ప్రాంతాల దొంగలు, గంజాయి, గుట్కా స్మగర్లు, ప్రేమికులు వచ్చిపోతున్నారని వచ్చిన కథనం మీద ఆయా లాడ్జీల నిర్వహకులు తమ వాట్సాప్ గ్రూపుల్లో, ఫోన్‌ల ద్వారా చర్చించుకున్నారు. దీనికి తోడు స్థానిక ఎస్సై లాడ్జీ నిర్వహకులకు వచ్చే నెల ఆగస్టు 3వ తేదీ వరకు అన్ని లాడ్జీల్లో సీసీ కెమెరాలు, రిజిస్టర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే ఆయా లాడ్జీలను సీజ్ చేస్తామని ఎస్సై హెచ్చరించినట్లు తెలిసింది. ఈ కథనంపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది.


